సేవ - స్నేహం శేముషించిన ........... సానువు.
మానవత్వం పరిమళించే .... మమతానురాగాల సింధువు.
అచ్చలమించుకైన కానరాని ...... గంభీర టక్కియము.
నిస్వార్ధ - నిగర్వ - నిరాడంబరతల .... నతిశయించు అభీషువు.
జనహితమె అభీప్సితంగా అభిలషించే ... పసిడి మంజూష.
ఓర్పు -సహనములె నిజ సహజాభరణములుగా ... భూషించు చికీర్షువు.
శాంతి - సామరస్యములే నిత్య సత్యాభ్యాసములుగా ...
అధ్యయించే అహింసా వ్రతం.
మృదు - మధుర భాషణముల నెల్లరి యుల్లముల ...
చల్లగ చెలగు నవనీత కలశము.
శ్రద్ధ - భక్తుల గూడిన వినయ - విధేయతల ...
మెలగు జన్మ సంస్కార జాతిరత్నం.
శతకోటి భారతీయాత్మల ... సదా ప్రకాశించే ...... అఖండ జ్యోతి.
సర్వదా ప్రభోదించే .... అనంత మూర్తి.
భయమెరుగని శౌర్య - ధౌర్య - స్థైర్య ... పౌరుషం.
బ్రిటీషు గుండెల హడలెత్తించిన ... పోరాట పటిమ.
అలుపెరుగని అవిశ్రాంత ... కఠోర దీక్షా దక్షతం.
తిరుగు లేని నిర్ణయాలకు ... పట్టు విడుపు లేని సాహసం.
అస్పృశ్యతను అదృశ్యం చేసిన ... తెగువ తేజం.
భగవద్గీతయే - సాధనాబలంగా ... పరిక్రమించిన ప్రజ్ఞాశాలి.
కొల్లాయి తప్పితే చిల్లుగాణీ ... చేబట్టని ... పరమహంస.
పేదలే భగవత్ బంధువులుగా ... మానవ సేవయే మాధవసేవగా
తరించే దయార్ద హృదయం.
అచరణే ... అదరణగా - అలోచనే ... అవేశంగా
జనమే ... ప్రభంజనంగా ప్రతిధ్వనించిన ... సర్వోదయావాహనం.
మేధస్సు మెరిసే వజ్రం. మనస్సు కడిగిన ముత్యం.
బుద్ధి నిశ్చల నిర్మలం. వ్యక్తిత్వం నిర్వికార నిరంజనం.
మానవత్వమే అభిమతం. శీలత్వమే మతతత్వం.
బోసి నవ్వుల్లో బోలెడు గుణాలు ... గుణపాఠాలు.
నడకలో - నడతలో ... ప్రచంఢ శక్తి.
ఛురకత్తుల్లాంటి ఛురకలు. వ్యంగాస్త్రాలతో హాస్యపు గుళికలు.
మాటలు ... తూటాలు. క్షణాల విలువలు తెలిసిన లాక్షణికుడు.
వృధా - దుబారాల కతీతుడు. పొదువు వొదువుకున్న బాధ్యతాయుతుడు.
జనం కోసమే జన్మించిన త్యాగశీలి.
జనం కోసమే శ్రమించిన ధన్య జీవి.
జనం కోసమే అసువులు బాసిన ... ప్రేమ పక్షపాతి.
విశ్వానికో వెలుగు కిరణం. ఆదర్శ ప్రకరణం.
దారి చూపించిన దేవదూత. మార్గదర్శ ప్రకర్షము.
కంటే - వింటే - చరిత్రను సృష్టిస్తే ... కోటాను కోట్లకు ఓక్కడే ...
ధృవ తారలా ... అమరజీవిలా.
ఓ బాపూజీ ... ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం ...
ఓ అశృకణ తర్పణం తప్ప.
ఓ మహాత్మా ... ఏమిచ్చి నీ పవిత్రాత్మకు శాంతి చేకూర్చగలం ...
నీ బాటలో నడవటం తప్ప.
ఓ జాతిపితా ... ఏమిచ్చి నీక్షమను పొందగలం ... ప్రేమను పంచడం తప్ప.
ఓ భారత భాగ్య విధాతా ... ఏమిచ్చి నీ కరుణకు పాత్రులవ్వగలం ...
చిత్త పుష్పార్పణం తప్ప.
ఓ విశ్వ హృదయా ... ఏమిచ్చి నీ త్యాగానికి బదులివ్వగలం ...
నీ చరిత్రను చాటిచెప్పడం తప్ప.
అఖండ భారతావని స్వేచ్ఛా స్వాతంత్య సమర నినాద
సత్యగ్రహాయుధ మౌన సేనానీ ....
కర్మ సాక్షికి నిలువెత్తు బింబంగా ... ప్రతిబింబించిన కర్మయోగీ....
నీకివే ... మా మానస లాలస నీరాజనాలు.
నీకివే ... మా శతకోటి వందన మందారాలు.
No comments:
Post a Comment